పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే25:
తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు

మండలం బలభద్రపురంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బహుళ అంతస్తుల పారిశ్రామిక సముదాయానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఒకే ప్రాంగణంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ఈ ప్రత్యేక పారిశ్రామిక సముదాయాన్ని నిర్మించనున్నారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, యువనాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్లు ఎం. సత్యనారాయణ, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 36 నియోజకవర్గాల్లో ఈ పారిశ్రామిక సముదాయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, అందులో అనపర్తి నియోజకవర్గం కూడా ఉండడం గర్వకారణమన్నారు. బలభద్రపురంలో కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.
గతంలో మహిళా పారిశ్రామిక వేత్తలకు స్థలాలు కేటాయించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించినప్పటికీ రాజకీయ కారణాలతో అడ్డంకులు ఎదురయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల్లో 26 పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ఈ సముదాయం నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
పారిశ్రామికీకరణ ద్వారానే సంపద సృష్టి సాధ్యమవుతుందని, ముఖ్యమంత్రి లక్ష్యం 2030 నాటికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలనేదేనని ఎమ్మెల్యే అన్నారు. పెద్ద పెట్టుబడుల పరిశ్రమలతో పాటు చిన్న పెట్టుబడులతో కూడా యువత పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
అనపర్తి నియోజకవర్గంలో వ్యక్తిగత ఆదాయం రాష్ట్ర సగటుతో పోలిస్తే అధికంగా ఉందని, దానికి కారణం ఇక్కడి ప్రజల్లో ఉన్న పని సంస్కృతి అని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయం, వ్యాపారం, బియ్యం మిల్లులు, కోళ్ల పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.
యువత పారిశ్రామిక రంగంలోకి రావాలని, చిన్న పరిశ్రమలు స్థాపించి భవిష్యత్తులో పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి… అనపర్తి నియోజకవర్గం మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా ఖాళీగా ఉన్న భూముల్లో భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.