POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 9:42 pm Posted by : POLITICAL POWER

‘బాదుడే బాదుడు’ అన్నోళ్ల పాలనలో.. బతుకే భారమైంది!

ధరల పెరుగుదలపై కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ధ్వజం

అనపర్తి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడిందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. మంగళవారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ నాయకులు ‘బాదుడే బాదుడు’ అంటూ ప్రచారం చేశారని, ప్రస్తుతం నాటి ధరలతో పోలిస్తే నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగాయని ఆరోపించారు.

పంచదార, బెల్లం, వంట నూనెలు, బియ్యం ధరలు పెరగడంతో కుటుంబాలను నడపడం మహిళలకు కష్టంగా మారిందన్నారు. కూరగాయలు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరిగి సామాన్యుడి బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై గతంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన ప్రచార వీడియోను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

రైతులకు సైతం కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. రైతుల వద్ద ధాన్యం ఉన్న సమయంలో సరైన మద్దతు ధర కల్పించకుండా, ధాన్యం వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన అనంతరం బియ్యం ధరలు పెంచుతున్నారని విమర్శించారు. రైతులకు దక్కాల్సిన లాభం దళారుల పాలవుతోందని మండిపడ్డారు. ఎరువుల ధరలు కూడా పెరిగాయని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ ప్రచారం చేస్తున్నా.. ప్రజల పరిస్థితి మాత్రం ‘సూపర్ సిక్స్ కాదు.. బతుకు భారం బాబూ’ అన్నట్లుగా మారిందని ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని సూర్యనారాయణ రెడ్డి అన్నారు.