ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే విక్రయించాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 16:ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా, విక్రయాల్లో పారదర్శకత పాటించేలా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 16వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల డిప్యూటీ తహసీల్దార్లు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులు సంయుక్తంగా బియ్యం విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బియ్యం విక్రయ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని అధికారులు సూచించారు. ప్రతి విక్రయ కేంద్రంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. నిర్ణీత ధరలకు మించి విక్రయించడం లేదా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం జరిగితే సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరల వివరాలు (కిలోకు).
| క్రమ సంఖ్య | బియ్యం రకం | ధర |
|---|---|---|
| 1 | BPT / KNM | రూ.66/- |
| 2 | RNR / తెలంగాణ సోనా | రూ.74/- |
| 3 | HMT / JSR | రూ.79/- |
ఈ తనిఖీ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ గుండి రాజులు, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల డిప్యూటీ తహసీల్దార్ బాదావత్ భద్రు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సోయం బిక్షమయ్య, వంకా వీరస్వామి, గ్రామ పాలన అధికారి కుంజా పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
