ప్రాంత అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
బుగ్గపాడు ఫుడ్ పార్క్‌పై జరుగుతున్న ప్రచారాలను ఖండించిన ఎమ్మెల్యే
రూ.650 కోట్ల రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌తో 3,000 మందికి ఉపాధి కల్పన లక్ష్యం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 20 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ వివాదంపై సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ మీడియా సమావేశంలో స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ… బుగ్గపాడు ఫుడ్ పార్క్ విషయంలో ఎవరికీ తోచిన విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బుగ్గపాడు ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫుడ్ పార్క్ మూతపడిపోవడంతో, తమ ప్రభుత్వం హయాంలో మళ్లీ తిరిగి ప్రారంభించామని చెప్పారు. బుగ్గపాడులో రూ.660 కోట్ల ప్రాజెక్టుతో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కృషి చేశామని పేర్కొన్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. పదేళ్లుగా పాడుబడిపోయిన ఫుడ్ పార్క్‌ను ప్రస్తుతం అభివృద్ధి దశలో నడుపుతున్నామని తెలిపారు. గత కొద్ది రోజులుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వచ్చి ఇష్టానుసారంగా విష ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చేస్తే చూసి ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం 2008 నుంచి 2014 వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూసేకరణ జరిగిందని తెలిపారు. 61.13 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేశామని, గిరిజన గ్రామాల అభివృద్ధి, అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకు రూ.109 కోట్లతో ఫుడ్ పార్క్‌ను అభివృద్ధి చేశామని, కొన్ని కంపెనీలు వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాయని వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి ఫుడ్ పార్క్‌ను పునఃప్రారంభించేందుకు సహకరించారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూముల ధరలు అధికంగా ఉంటే కంపెనీలు రావని పెద్దలను కోరామని, దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి 3,000 మంది యువకులకు ఉపాధి కల్పిస్తామని ముందుకు వచ్చిందన్నారు. రూ.650 కోట్ల ప్రాజెక్టు కోసం ఇతర ప్రాంతాల్లో కూడా భూములు పరిశీలించినప్పటికీ, బుగ్గపాడులో ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందని భావించి అందరి ఆమోదంతో ఆ కంపెనీకి భూములు కేటాయించామని తెలిపారు. ఇందులో ఎటువంటి చెడు కోణం లేదని, ప్రాంత ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే రాగమయి స్పష్టం చేశారు.