POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 7:47 pm Posted by : POLITICAL POWER

బెల్ట్ షాపుల దందాతో మద్యం కొనుగోలుదారులపై అదనపు భారం?

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మధ్య మాఫియా 

సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఎ హరిబాబు జూన్ 27 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని మద్యం విక్రయాల పేరుతో సామాన్య ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారిక మద్యం దుకాణాల్లో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే బ్రాండెడ్ మద్యం కావాలనే అందుబాటులో ఉంచకుండా, బెల్ట్ షాపులకు మళ్లిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల నుంచి బెల్ట్ షాపులకు చేరిన క్వార్టర్‌పై ముందుగా రూ.30 అదనంగా, అక్కడి నుంచి వినియోగదారుడికి మరో రూ.30 ఎక్కువకు విక్రయిస్తూ ఒక్కో క్వార్టర్‌పై రూ.60 వరకు అదనపు భారం మోపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజంతా కూలీ చేసి రూ.300–400 సంపాదించే కార్మికుడు సాయంత్రం ఒక క్వార్టర్ కొనుక్కుందామంటే తనకు కావాల్సిన బ్రాండ్ అధికారిక షాపులో దొరకక, చివరికి బెల్ట్ షాపును ఆశ్రయించి అధిక ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మద్యం దుకాణాలు–బెల్ట్ షాపుల మధ్య సిండికేట్ నడుస్తోందా? అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందా? రోజువారీ కూలీల జేబుకు గండి కొడుతున్న ఈ దందాపై ఎక్సైజ్ శాఖ ఎందుకు మౌనం వహిస్తోంది? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.