POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:00 pm Posted by : POLITICAL POWER

బ్రహ్మంగారిమఠంలో అక్రమ యూరియా నిల్వలపై సమగ్ర విచారణ జరపాలి: సీపీఐ డిమాండ్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బ్రహ్మంగారిమఠం, ఆగస్టు 3: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా సుమారు 3,000 బస్తాల యూరియా, ఇతర రసాయన ఎరువులను అక్రమంగా నిల్వ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ బ్రహ్మంగారిమఠం మండల కార్యదర్శి పెద్దల్లపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా, ఎరువులను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడం రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ నిల్వల వల్ల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు నామమాత్రపు విచారణ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన విమర్శించారు. పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించకుండా వ్యవహరించడం వల్ల అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఎలాంటి లైసెన్సులు, నిల్వ అనుమతులు లేకుండా వేల బస్తాల ఎరువులు ఎలా నిల్వ చేశారో, వాటి కొనుగోలు బిల్లులు, రవాణా పత్రాలు, గోదాం అనుమతులు, స్టాక్ రిజిస్టర్లు తదితర రికార్డులను స్వాధీనం చేసుకుని సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమాలను అడ్డుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరించిన మండల వ్యవసాయ అధికారి (ఏవో)పై కూడా శాఖాపరమైన విచారణ నిర్వహించి తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిల్వలకు పాల్పడిన వ్యక్తుల లైసెన్సులను వెంటనే రద్దు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అక్రమంగా నిల్వ చేసిన యూరియా, ఎరువులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని పెద్దల్లపల్లి ప్రభాకర్ హెచ్చరించారు.

ప్రధాన డిమాండ్లు: బ్రహ్మంగారిమఠం మండలంలో అక్రమంగా నిల్వ చేసిన 3,000 బస్తాల యూరియా, ఎరువులపై సమగ్ర విచారణ చేపట్టాలి. అక్రమ నిల్వలకు పాల్పడిన వారి లైసెన్సులను వెంటనే రద్దు చేయాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణలో విఫలమైన మండల వ్యవసాయ అధికారి (ఏవో)పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలి. విచారణ నివేదికను బహిరంగపరచి రైతులకు న్యాయం చేయాలి.