పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 24 2026: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వైయస్ జగన్‌కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ జగన్, స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు.
ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబానికి పరామర్శ
ఆలయ కార్యక్రమం అనంతరం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లిన వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో శ్రీరామిరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన వైయస్ జగన్, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీరామిరెడ్డి పార్టీ కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన మరణం వైఎస్సార్‌సీపీకి తీరని లోటని పేర్కొన్నారు. పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.