రాజకీయ దురుద్దేశంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బురదజల్లడం తగదు
గ్రామ పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధం.. రాళ్ల కృష్ణయ్య
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: ఖిల్లా ఘనపురం మండలం అగారం గ్రామ శివారులో జరిగిన భూమి కొనుగోలు వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రాళ్ల కృష్ణయ్య తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అగారం గ్రామ శివారులో లక్ష్మమ్మ భర్త చిన్న బొక్కెన్న, మొగిలయ్యకు సంబంధించిన 4 ఎకరాల 20 గుంటలు, మునగపాటి యాదగిరికి సంబంధించిన 2 ఎకరాల 10 గుంటలు, రాళ్ల కృష్ణయ్యకు సంబంధించిన 2 ఎకరాల 10 గుంటల భూమి కొనుగోలు వ్యవహారం జరిగినట్లు తెలిపారు. మొత్తం భూమికి రూ.5 లక్షల 4 వేల ధర నిర్ణయించి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. భూమి కొనుగోలు సమయంలో పట్టా భూమికి సంబంధించిన ఆర్‌ఓఆర్ (ROR) వివరాలు పరిశీలించి, విక్రేతలకు పూర్తి నగదు చెల్లించిన అనంతరం మునగపాటి యాదగిరి, తన పేర్లపై భూమిని మార్చుకున్నామని రాళ్ల కృష్ణయ్య వివరించారు. అయితే 2024లో భూమి విక్రయించిన లక్ష్మమ్మ కుమారులు నలుగురు గ్రామ పెద్దలతో కలిసి తమ ఇంటికి వచ్చారని, తమ తల్లిదండ్రులు భూమి అమ్మగా వచ్చిన డబ్బులను తమకు ఇవ్వకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద కదరయ్య, చిన్న కదరయ్య, నాగరాజు, నాగార్జునలకు అగారం గ్రామ మాజీ సర్పంచ్, ప్రస్తుత ఉపసర్పంచ్, వివిధ కులాల గ్రామ పెద్దల సమక్షంలో రూ.80 వేల నగదు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న చిన్న కదరయ్య కూడా ఆ సమయంలో స్వయంగా నగదు తీసుకున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ గత సంవత్సరం చిన్న కదరయ్య తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేయగా, వాటికి తాము చట్టపరంగా వివరణ ఇచ్చుకున్నామని తెలిపారు. ఈ భూమి వ్యవహారాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ, అభివృద్ధి విషయంలో ఏమీ సాధించలేక మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని రాళ్ల కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత యువకుడిని ముందుపెట్టి రాజకీయాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. తాను 1985 నుంచి స్నేహితులతో కలిసి ఆలయ భజనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, వారితో ఇప్పటికీ కలిసి భోజనం చేస్తున్నానని పేర్కొన్నారు. దళితుల పట్ల నిజమైన గౌరవం ఉందని చెబుతున్న కాంగ్రెస్ నాయకుల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
గ్రామ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం
భూమి కొనుగోలు వ్యవహారంపై అగారం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాళ్ల కృష్ణయ్య స్పష్టం చేశారు. భూమిని తిరిగి ఇవ్వాలని గ్రామ పెద్దలు నిర్ణయించినా, మునగపాటి యాదగిరి, తాను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. సోషల్ మీడియాలో నిరాధార వీడియోలు, ఆరోపణలు చేయడం మానుకొని, ఆరోపణలు చేస్తున్న వారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎక్కడో ఉండి గౌరవప్రదమైన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తే సహించేది లేదని రాళ్ల కృష్ణయ్య హెచ్చరించారు.