POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 10:07 pm Posted by : POLITICAL POWER

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే జైలుకే.. బిక్కవోలు పోలీసుల హెచ్చరిక

బిక్కవోలు:  పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న రాత్రి 7:57 గంటలకు బలభద్రపురం గ్రామంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో బలభద్రపురం గ్రామానికి చెందిన కొల్లబత్తుల అప్పారావు, తండ్రి వీర్రాజు, వయస్సు 33 సంవత్సరాలు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసును సెప్టెంబర్ 1న విచారించిన స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కనకదుర్గ రూ.10 వేల జరిమానా లేదా మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల జైలు శిక్ష అనుభవించేందుకు అప్పారావును రామచంద్రాపురం సబ్‌జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా బిక్కవోలు పోలీసులు మండల ప్రజలను అప్రమత్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇకపై కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులను కోర్టులో ప్రవేశపెడతామని హెచ్చరించారు.

మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించుకోవాలని, రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బిక్కవోలు పోలీసులు కోరారు.

మద్యం సేవించి వాహనం నడపవద్దు.. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడండి.