POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:15 pm Posted by : POLITICAL POWER

మధరావుపల్లిలో కనుమరుగవుతున్న వినోభా భావే–నెహ్రూ జ్ఞాపకాలు: పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: పానుగల్ మండలంలోని మధరావుపల్లి గ్రామంలో ఉన్న చారిత్రాత్మక జ్ఞాపకాలను పరిరక్షించాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన ఆయన, సభ్యులతో కలిసి అక్కడి చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేశారు. 1956 మార్చి 7న భూదాన్ ఉద్యమం భాగంగా పాదయాత్ర నిర్వహిస్తూ వినోభా భావే మధరావుపల్లికి చేరుకున్నారని తెలిపారు. అదే సమయంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల భవన ప్రారంభోత్సవం కోసం వచ్చిన అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, వినోభా భావే మధరావుపల్లిలో ఉన్నారని తెలుసుకుని గ్రామానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.

ఆ సందర్భంగా భాషాప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశంపై అక్కడ చర్చలు జరిగినట్లు తెలిపారు. భూదాన్ ఉద్యమం ద్వారా లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన వినోభా భావే, దేశ తొలి ప్రధాని నెహ్రూ కలిసి చర్చలు జరిపిన చారిత్రక ప్రదేశంగా మధరావుపల్లి గుర్తింపు పొందిందన్నారు. ఇలాంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ప్రస్తుతం కనుమరుగవుతుండటం బాధాకరమని పలుస శంకర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అక్కడ వినోభా భావే, జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాలు ఏర్పాటు చేసి, పార్క్ అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. తద్వారా భావితరాలకు చరిత్ర తెలియజేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు ఉప్పరి తిరుమలేష్, భాస్కర్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.