మహిళా సంఘాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 04 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో మహిళా సంఘాలకు శాశ్వత భవనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, నూతన మహిళా సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… మనిగిల్ల గ్రామంలో రెండు విలేజ్ ఆర్గనైజేషన్ల (VOలు) పరిధిలో సుమారు 52 మహిళా సంఘాలు ఉన్నాయని తెలిపారు. అయితే మహిళా సంఘాలకు సరైన సమావేశ భవనం లేకపోవడంతో చెట్ల కింద, ఆలయాల వద్ద సమావేశాలు నిర్వహిస్తూ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న మహిళా సంఘ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా నేడు మహిళా గ్రామసభ నిర్వహించి నూతన భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి, గ్రామసభలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. రెండు VOలను కలిపి ఒక పెద్ద మహిళా సంఘ భవనాన్ని మంజూరు చేయాలని ఎంపీడీవో పరిణతను కోరినట్లు తెలిపారు. మహిళా మండలి సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో సుమారు 700 జాబ్ కార్డులు ఉండగా, వేసవికాలంలో రోజుకు దాదాపు 200 మంది ఉపాధి హామీ పనులకు వస్తారని తెలిపారు. గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను VB-G RAM G పథకం ద్వారా ఎలాంటి వివక్ష లేకుండా మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎంపీడీవో పరిణతను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహిళా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి గ్రామ తీర్మాన పత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ మహిళల సాధికారతతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు అక్షరాస్యత, ఆరోగ్యం విషయంలో ముందుండాలని, బాల్యవివాహాలను ప్రోత్సహించకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. మహిళా సంఘ భవన నిర్మాణంతో పాటు అవసరమైన ఇతర సహాయ సహకారాలు అందించేందుకు గ్రామపంచాయతీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ మహిళా సంఘ భవన నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించి తీర్మానం చేసిన సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు అందుబాటులో ఉన్న వివిధ రకాల రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. త్వరలోనే మహిళా సంఘ భవనం అందుబాటులోకి రానుండటం సంతోషంగా ఉందని, మహిళలందరూ గ్రామసభలకు హాజరై చైతన్యవంతులై గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఏఈఓ వంశీ, వార్డు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, జయమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల, కోశాధికారి శ్రావణి, శిరీష, సంఘ సభ్యురాలు సావిత్రి, గ్రామ పెద్దలు సుంచరమోని రాములు, మన్యం, పోతుల రామిరెడ్డి, బోడి గణేష్, అంజి, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.