జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ కడప, ఆగస్టు 17 2026: ప్రతిరోజూ విద్యార్థులకు శుచికర, రుచికరమైన పోషక విలువలున్న మధ్యాహ్న భోజనాన్ని సకాలంలో అందిస్తూ.. దేశానికే స్ఫూర్తినిస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా త్వరలో లక్ష మందికి విస్తరిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలో కిచెన్ మేనేజర్లుగా ఎస్.హెచ్.జి. మహిళల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ.. దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు జిల్లా యంత్రాంగం గర్వించదగ్గ విషయం అని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో.. “స్మార్ట్ కిచెన్ వ్యవస్థ” ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, మరింత విస్తృత పరిచేలా చేపట్టిన అదనపు స్మార్ట్ కిచెన్ ల నిర్మాణ పురోగతిపై.. సంబంధిత కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జేసీ డా. నిధీమీనా, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, డిఆర్వో మల్లికార్జునుడు, అన్ని రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్మార్ట్ కిచెన్ నిర్వహణ బాధ్యతలను కిచెన్ మేనేజర్లతో పాటు.. ఈ బృహత్తర కార్యంలో భాగస్వామ్యం అయిన సంబంధిత శాఖల అధికారులందరూ.. నిబద్ధతతో, బాధ్యతతో వారి బాధ్యతలను నిర్వహించడంతో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషకాహారం సకాలంలో అందుతోందన్నారు. స్మార్ట్ కిచెన్‌లో తయారవుతున్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న సానుకూల స్పందన ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి కూడా భోజన ప్లేట్ యూనిక్ గా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ అంశాలన్నింట్లో కూడా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం 27 స్మార్ట్ కిచెన్ల ద్వారా.. 864 పాఠశాలల్లో దాదాపు 53 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ శుచికరమైన రుచికర భోజనం ప్రత్యేక ఫుడ్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ద్వారా అందుతోందన్నారు. త్వరలో జిల్లాలో ప్రతిరోజూ సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని స్మార్ట్ కిచెన్ల నిర్వహణలో భాగంగా.. శుచిగా, రుచిగా వంట వండడం, సకాలంలో రవాణా, సంతృప్తి స్థాయిలో వడ్డించడం.. మొదలైన అంశాల్లో పనితీరుపై సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. బాధ్యతతో కూడిన శిక్షణ పొందిన డ్రైవర్ల ద్వారా ఫుడ్ ట్రక్కుల ద్వారా భోజనాన్ని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. దేశంలోనే ఏ సంస్థ అమలు చేయని స్థాయిలో అత్యాధునిక సాంకేతికత, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థ, నాణ్యత ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి అధికారి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థను జాతీయ స్థాయిలో నీతీ ఆయోగ్ నుండి ప్రశంసలతో పాటు.. దేశానికే స్ఫూర్తిగా నిలిచామన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ అనురాధ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సివిల్ సప్లై, రవాణా శాఖ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.