
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :
మహబూబాబాద్: జిల్లా నవంబర్ 4 మహబూబాబాద్ పట్టణంలోని రాహుల్‌నగర్ కాలనీలో పట్టపగలే భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో భద్రపరిచిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఉన్న సుమారు 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.5 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తాళం పగలగొట్టి ఉండటాన్ని, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు.
వెంటనే బాధిత కుటుంబ సభ్యులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
పట్టణంలోని నివాస ప్రాంతంలో భారీ చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను త్వరితగతిన గుర్తించి, అపహరణకు గురైన సొత్తును స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.