POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 8:36 pm Posted by : POLITICAL POWER

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం

గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును ప్రశ్నించిన ప్రజాప్రతినిధులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026: మిషన్ భగీరథ పనితీరు అస్తవ్యస్తంగా మారిందని, పైపులైన్లలో తరచూ లీకేజీలు ఏర్పడటంతో గ్రామాలకు సక్రమంగా తాగునీరు అందడం లేదని పెద్దమందడి మండలంలోని పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దమందడి మండలంలోని రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి విజయ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పెద్దమందడి గ్రామానికి రెండు, మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని గ్రామ సర్పంచ్ సూర్య గంగమ్మ తెలిపారు. వెల్టూరు గ్రామ సర్పంచ్ అశోక్‌ (చిట్టిబాబు) మాట్లాడుతూ… హైవే రహదారి పనుల సమయంలో మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నప్పటికీ సూపర్‌వైజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత గ్రామ సభ సమావేశంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని వీరయ్యపల్లి, వెల్టూరు, అల్వాల గ్రామాల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సమస్యలకు స్పష్టమైన సమాధానాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మద్దిగట్ల గ్రామానికి ప్రస్తుతం సుమారు 20 కేఎల్ నీరు మాత్రమే వస్తుండటంతో రెండు గ్రామ పంచాయతీ బోర్ల ద్వారా నీటి అవసరాలను సర్దుబాటు చేసుకుంటున్నామని మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు యాదవ్ తెలిపారు. పాత మద్దిగట్ల నుంచి గ్రామంలోని వాటర్ ట్యాంకులకు పైప్‌లైన్ అనుసంధానం చేయడానికి అదనంగా రూ.10 లక్షలు అవసరమవుతున్నందున స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ప్రతిపాదనలు పంపినట్లు మిషన్ భగీరథ ఏఈ తెలిపారు. సమస్యలపై అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడం కంటే ముందుగా గ్రామాల్లో మిషన్ భగీరథ పనులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు.

 

పాఠశాలలకు పెయింట్లు వేసేదెప్పుడు?

సమావేశంలో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలపైనా సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రూఫ్‌సింగ్ తండా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో పాఠశాలలకు పెయింటింగ్ పనులు చేపట్టవచ్చా అని మండల విద్యాధికారి మంజులతను ప్రశ్నించారు. దీనికి విద్యాశాఖ నిధుల ద్వారా ఆ పనులు చేపట్టవచ్చని ఆమె సమాధానమిచ్చారు. వెల్టూరు పాఠశాలలో ఖాళీగా ఉన్న పెయింట్ డబ్బాలను తరలించాలని సర్పంచ్ కోరారు. మద్దిగట్ల హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని సర్పంచ్ మేకల రాములు యాదవ్ తెలిపారు. దీనిపై జగత్‌పల్లి నుంచి డిప్యూటేషన్‌పై త్వరలో ఉపాధ్యాయుడిని పంపిస్తామని అధికారులు తెలిపారు. పెద్దమందడి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని పీఆర్‌ ఏఈ రమేష్ నాయుడు తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, విద్య, పాఠశాల మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు.