POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 7:51 pm Posted by : POLITICAL POWER

మున్నూరు రవీందర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి

పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నేతకు అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీకి జిల్లా నాయకుల మద్దతుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: హైదరాబాద్ –రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్వకేట్ మున్నూరు రవీందర్‌కు బీజేపీ తరఫున టికెట్ కేటాయించాలని వనపర్తి జిల్లా బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మున్నూరు రవీందర్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.మున్నూరు రవీందర్‌కు బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉందని, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి అవకాశం కల్పించాలని నాయకులు కోరారు. 1969 నుంచి బాల స్వయం సేవక్‌గా పనిచేసిన ఆయన, 1980 నుంచి బీజేపీ కార్యకర్తగా క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గట్కేసర్‌లో పార్టీ బాధ్యతలు నిర్వహించడంతో పాటు 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యారని పేర్కొన్నారు.రెండు పర్యాయాలు స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా, 2002లో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. 1987 నుంచి 2003 వరకు వనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారని, 1994లో వనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని వివరించారు. పాదయాత్రలు, పల్లెపల్లె నిద్ర కార్యక్రమాలు, కేడెద్దుల ప్రదర్శనలు, బుల్లాక్ కార్ట్స్ ర్యాలీలతో పాటు పార్టీ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు.ఈ సందర్భంగా మున్నూరు రవీందర్ మాట్లాడుతూ పాత మహబూబ్‌నగర్ జిల్లాలో తమ కుటుంబానికి మంచి గుర్తింపు ఉందన్నారు. తన తండ్రి మున్నూరు కృష్ణయ్య డిగ్రీ కళాశాలను స్థాపించి బోధనా, బోధనేతర సిబ్బందికి ఉపాధి కల్పించారని తెలిపారు. తాను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యానని, పలు బ్యాంకులకు ప్యానెల్ అడ్వకేట్‌గా సేవలందిస్తున్నట్లు వివరించారు.పార్టీ కోసం ఇన్నేళ్లుగా చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ అభ్యర్థిత్వానికి వనపర్తి జిల్లా నాయకులు మద్దతు ప్రకటించి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.వనపర్తి జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంలో అవకాశం కల్పించాలని జిల్లా నాయకులు రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, కేతూరి బుడ్డన్న, రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.