పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 10 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో గ్రామసభ మరియు బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, విద్యా ప్రగతి అంశాలపై నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని సమీక్ష చేపట్టారు.
కార్యక్రమానికి మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, ఉపసర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు గౌడ్, మహిళా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు మరియు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుగంధర్ మాట్లాడుతూ… మోజర్ల ప్రాథమిక పాఠశాలకు పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) పాఠశాల మంజూరైందని తెలిపారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వయస్సు గల చిన్నారులు ఈ పాఠశాలలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్ల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం పాఠశాల విజయానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 21 రకాల విద్యా సామగ్రితో పాటు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా వారానికి మూడు గుడ్లు, మూడు సార్లు రాగి జావ అందిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని వివరించారు. అలాగే విద్యార్థులకు అవసరమైన ఉచిత నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అందాయని తెలిపారు. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లోనూ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నందున బడిఈడు గల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరి ప్రభుత్వ విద్యా సదుపాయాలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. గ్రామసభలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, ప్రజలు వెల్లడించిన సమస్యలను సంబంధిత అధికారులు నమోదు చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.