పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం దమ్మపేటలో రక్తదాన శిబిరం
పొలిటికల్ పవర్, దమ్మపేట,అక్టోబర్30: పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అశ్వారావుపేట సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, అశ్వారావుపేట, దమ్మపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
