POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 10:28 am Posted by : POLITICAL POWER

రఘునాధపాలెం గిరిజన గ్రామాలకు రూ.110 కోట్లు ఇవ్వండి

కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ 

వరద నీటి కాలువల నిర్మాణానికి నిధుల కోసం విజ్ఞప్తి

37 పంచాయతీల్లో 28 ఏజెన్సీ, గిరిజన గ్రామాలు

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు లేఖ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 24 2026: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో ఏజెన్సీ, గిరిజన గ్రామ పంచాయతీలకు వరద నీటి కాలువలు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం కోసం రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత-జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు లేఖ రాశారు. సోమవారం రాసిన ఈ లేఖలో మండలంలోని డ్రైనేజీ సమస్యలను మంత్రి వివరించారు. మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 28 ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో సరైన వరద నీటి కాలువలు లేక ఈ గ్రామాలు తీవ్ర నీటి నిల్వ, పారిశుధ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయని, గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువలు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పనులకు రూ.110 కోట్లు అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తన నియోజకవర్గ పరిధిలోని ఈ గిరిజన ప్రాంతాలకు సరిపడా స్థానిక వనరులు లేనందున, గ్రామీణాభివృద్ధి లేదా గిరిజన ప్రాంత అభివృద్ధి పథకాల ద్వారా నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని తుమ్మల కోరారు. ప్రతిపాదిత పనులు ఈ గిరిజన ప్రాంతాల్లో పారిశుధ్యం, ప్రజారోగ్యం, జీవన పరిస్థితులు, మొత్తం మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. డీపీఆర్‌తో పాటు గ్రామ పంచాయతీల జాబితాను లేఖకు జతచేస్తూ, నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించాలని కేంద్ర మంత్రిని ఆయన అభ్యర్థించారు.