సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహణ
రాజీ పడదగిన కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచన
లోక్ అదాలత్, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించిన న్యాయాధికారులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 20 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ పి.పి. కృష్ణ అర్జున్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.పి. కృష్ణ అర్జున్ మాట్లాడుతూ… “రాజీమార్గమే రాజమార్గం” అని పేర్కొన్నారు. రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులు పరస్పర అవగాహనతో కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఎంఎల్‌ఎస్‌సీ విధుల గురించి వివరిస్తూ, 1) పీఎల్‌సీ కేసులపై అవగాహన కల్పించడం, 2) న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం, 3) పారాలీగల్ వాలంటీర్లను నియమించడం, 4) ఉచిత న్యాయ సహాయం అందించడం, 5) జైలు అదాలత్‌లు నిర్వహించడం, 6) లోక్ అదాలత్‌లు నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు కక్షిదారులకు వివరించారు. లోక్ అదాలత్ అంటే “ప్రజల న్యాయస్థానం” అని, ఇది వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ అని తెలిపారు. దీనికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం–1987 కింద చట్టబద్ధమైన హోదా ఉందని, ఇది సివిల్ కోర్టు తీర్పుతో సమానమైన తుది నిర్ణయాలను ఇస్తుందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు లేదా న్యాయస్థానంలో విచారణకు ముందున్న కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ఇచ్చిన నిర్ణయం సివిల్ కోర్టు తీర్పుగా పరిగణించబడుతుందని, అది అంతిమమైనదిగా అందరికీ కట్టుబడి ఉంటుందని, దానికి వ్యతిరేకంగా ఎలాంటి అప్పీల్ ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కె. మీరా ఖాసీం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.ఎస్.ఎన్. సుమబాల, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. లావణ్య, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జె. గోపాలరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వరరావు, బార్ లైబ్రరీ కార్యదర్శి నల్లగట్ల విజయ్‌కుమార్, న్యాయవాదులు బొర్రా వెంకట్రావు, వి. రామకృష్ణ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.