కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్
ఎన్విఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇన్చార్జ్ ఆలస్యం విరన్ 25 జూలై 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రజా సేవలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమేనని పబ్లిక్ ఫోరం రాష్ట్ర సమన్వయకర్త, వినియోగదారుల రక్షణ, ఆర్టీఐ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ ధ్వజమెత్తారు. అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తాలేఖర్లు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతరం జరిగిన జిల్లా దస్తాలేఖర్ల విస్త్తత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనం వహించాల్సిన ప్రభుత్వ సేవలను లాభాపేక్షతో పనిచేసే ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. పారదర్శకత పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396 ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. భూములు, ఇళ్లు, వారసత్వ ఆస్తులు, వీలునామాలు వంటి కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తుల వివరాలు, కుటుంబ, ఆర్థిక సమాచారం అత్యంత గోప్యమైనవని, అలాంటి సమాచారాన్ని ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉండే సేవా కేంద్రాలకు అప్పగించడం ప్రజల గోప్యతకు, భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కీలక విధానాలను రూపొందించే సమయంలో, ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను తీసుకునే ముందు ఆర్టీఐ చట్టం 2005లోని సెక్షన్ 4(1) (సి) ప్రకారం అందుకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన దుయ్యబట్టారు. ‘దళారుల వ్యవస్థను నిర్మూలిస్తున్నామని చెప్పే ప్రభుత్వం, అదే బాధ్యతలను ఒప్పంద సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులో ఉన్న పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానం ద్వారా ప్రజలకు ఇప్పటికే సౌకర్యం ఉందని, కొత్తగా పీపీపీ సేవా కేంద్రాల అవసరం ఏమిటని నిలదీశారు. గతంలో దస్తాలేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు వాళ్ల అనుభవాన్ని పూర్తిగా పక్కనపెట్టడం విచారకరమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకు చట్టపరమైన మార్గదర్శకత్వం అందిస్తూ సేవలందిస్తున్న దస్తావిలేఖర్ల జీవనోపాధిపై ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల నమూనాను రిజిస్ట్రేషన్ శాఖకు వర్తింపజేయడం సరికాదని పేర్కొంటూ, పాస్‌పోర్ట్ సేవలు వ్యక్తిగత గుర్తింపుతో మాత్రమే ముడిపడి ఉంటే, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ప్రజల ఆస్తి హక్కులు, కుటుంబ వివాదాలు, ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉండే అత్యంత సున్నితమైన అంశమని అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఫెసిలిటేషన్ ఛార్జీ గరిష్ఠంగా రూ.2 వేలేనని చెబుతున్నా, ఒకసారి ప్రైవేటీకరణకు తలుపులు తెరిస్తే భవిష్యత్తులో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడదన్న హామీ ఏమిటని ప్రశ్నించారు. ముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు, తగిన సిబ్బంది, ఆధునిక సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, జీవో ఎంఎస్ నెం.396ను తక్షణమే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దస్తాలేఖర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రజా సేవలు ప్రజల కోసమే ఉండాలి … ప్రైవేటు లాభాల కోసం కాదు. రిజిస్ట్రేషన్ శాఖను కార్పొరేట్ ప్రయోగాలకు వేదికగా మార్చే ప్రయత్నాలను ప్రజలందరూ వ్యతిరేకించాలి’ అని కాండ్రేగుల వెంకటమరణ పిలుపునిచ్చారు. జిల్లా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ ప్రతినిధులు అయోధ్య శేషు, బొగ్గారపు గున్నాజీరావు, భమిడి వరప్రసాద్, దాసరి రమేష్, ఎస్.నాగశేషు, డి.బాబూరావు, కె.మురళి కృష్ణ, శేఖరమంత్రి శ్రీను పాల్గొన్న ఈ సమావేశంలో అనకాపల్లి, చోడవరం, నక్కపల్లి, మాడుగుల, కె.కోటపాడు, కోటవురట్ల, నర్సీపట్నం, యలమంచిలి, సబ్బవరం మొదలగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు.