POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 6:16 am Posted by : POLITICAL POWER

రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు

విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ.. 70 సీసీ కెమెరాల పరిశీలన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో  వనం శ్రీనివాస్ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. రూపా రెడ్డిని ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులే హత్య చేసినట్లు దర్యాప్తులో నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు ఎస్పీ చెప్పారు. రూపా రెడ్డి చివరిసారిగా తన పిన్నితో మాట్లాడిన సమయంలో ‘బాబు’ అని సంబోధించినట్లు గుర్తించిన పోలీసులు, ఆమె విద్యార్థులను కూడా అదే విధంగా పిలుస్తారని తెలుసుకుని ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హత్య అనంతరం నాలుగు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించగా, స్కూల్ తిరిగి ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులను విచారించారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఇద్దరు ఇటీవల పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసుకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఒక నిందితుడి వద్ద రూ.1.54 లక్షల నగదు లభించగా, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించడంతో తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే నగదుపై రక్తపు మరకలు గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, అవి రూపా రెడ్డి రక్తమని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్‌లో ఉండేవాడని, అతని వద్ద నగదు, ఫోన్ గుర్తించిన రూపా రెడ్డి మందలించడంతో హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి అతనికి రూపా రెడ్డిపై కోపం పెరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక నిందితుడు కొంతకాలం క్రితం గోవాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రూపా రెడ్డి ఇంట్లో పాఠశాల ఫీజుల డబ్బు ఉంటుందని తెలుసుకుని, ఘటనకు ఐదు రోజుల ముందే ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ నెల 11న పాఠశాల నుంచి రూపా రెడ్డి ఇంటికి వచ్చిన అనంతరం ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరి మాస్క్ జారిపోవడంతో రూపా రెడ్డి అతడిని గుర్తించిందని, దీంతో ఆమెపై కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడ్డారని చెప్పారు. అనంతరం ఆమె ఫోన్, నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్, రూపా రెడ్డికి చెందిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైనర్లు కావడంతో చట్ట ప్రకారం జువెనైల్ జస్టిస్ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.