POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 5:21 pm Posted by : POLITICAL POWER

*రేకలకుంట కొండల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న గాలిమరల నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి సంబంధిత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి–సిపిఐ డిమాండ్*

 


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
మఠం మండలం రేకలకుంట గ్రామ పరిధిలోని కొండ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, సంబంధిత శాఖల క్లియరెన్స్‌లు లేకుండా గాలిమరల నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ……రేకలకుంట కొండల్లో గాలిమరల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూ అనుమతులు, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు, రెవెన్యూ శాఖ అనుమతులు తదితర చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కోరారు.

అనుమతులు లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లయితే వాటిని తక్షణమే నిలిపివేసి, సంబంధిత కంపెనీ యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి నిర్మాణాలు చేపట్టడం వల్ల కొండ ప్రాంతాల సహజ స్వరూపం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి, స్థానిక ప్రజల జీవనాధారాలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గాలిమరల నిర్మాణం కోసం కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, భారీ యంత్రాల వినియోగం, కొండలను చదును చేయడం, చెట్ల తొలగింపు వంటి పనులు చేపడుతున్నట్లయితే వాటిపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాలని కోరారు. అలాగే నిర్మాణానికి వినియోగిస్తున్న భూముల హక్కులు, పట్టాలు, అనుమతులు, కంపెనీకి మంజూరైన ప్రభుత్వ ఉత్తర్వులు, పర్యావరణ మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు తెలియకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే చేపట్టిన పనులపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సిపిఐ నాయకులు కోరారు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని నిర్మాణాలు ఉన్నట్లు తేలితే వెంటనే వాటిని తొలగించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది.

రేకలకుంట కొండ ప్రాంతాలను పరిరక్షించేందుకు అధికారులు తక్షణమే స్పందించి, గాలిమరల నిర్మాణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సిపిఐ స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి సోమిరెడ్డిపల్లి నారాయణ ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి గుడిమె సురేష్, సుమంత్ పాల్గొన్నారు.