POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 6:15 pm Posted by : POLITICAL POWER

రేపటి భవిష్యత్తు కోసం.. నేటి బాల్యాన్ని బలి చేయొద్దు!

 

చదువు పేరుతో పసి మనసులపై ఒత్తిడి వద్దు.. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, పాఠశాలలపై అధికారుల నిఘా అవసరం

అనపర్తి: రేపటి భవిష్యత్తు కోసం నేటి బాల్యాన్ని బలి చేయొద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. అభం శుభం తెలియని పసి పిల్లలపై చదువు పేరుతో మితిమీరిన ఒత్తిడి తీసుకురావడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల వయస్సు, వారి మానసిక స్థితి, ఆలోచనా శక్తిని పరిగణనలోకి తీసుకోకుండా విపరీతమైన వర్క్‌ ఇవ్వడం, ర్యాంకులు.. మెరిట్‌ల పేరుతో పోటీ పెంచడం, చదువులో వెనుకబడితే భయపెట్టడం, బెదిరించడం వంటి చర్యలు చిన్నారులపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు చదువుకోవాలి.. కానీ చదువు కోసం భయపడకూడదు అన్న విషయాన్ని పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు గుర్తించాల్సిన అవసరం ఉంది. చిన్నారుల వయస్సుకు మించిన పాఠ్యభారం, చేయలేనంత వర్క్‌ అప్పగించడం, ప్రతి విషయంలో ర్యాంకులు, మార్కులే లక్ష్యంగా పెట్టడం వల్ల పిల్లల్లో చదువుపై ఆసక్తి తగ్గి, ఆందోళన పెరిగే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో కూడా పిల్లలనే ఒత్తిడికి గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మీ తల్లిదండ్రులు ఇంకా ఫీజు ఎందుకు కట్టలేదు?” అంటూ చిన్నారులను పిలిచి అడగడం ఎంతవరకు సమంజసం అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఫీజు చెల్లింపులకు సంబంధించిన విషయాలు తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడాల్సింది పోయి, పసి పిల్లల ముందు ప్రస్తావించడం వారి మనసుల్లో అవమాన భావన, భయాన్ని కలిగించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“ఫీజు కావాలంటే మాతో మాట్లాడండి.. మా పిల్లలను మధ్యలోకి లాగొద్దు” అంటూ పలువురు తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ఒకటికి పదిసార్లు ఫోన్‌లు చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం కూడా సరికాదని అంటున్నారు.

అధికారుల తనిఖీలపై కూడా ప్రశ్నలు

ఇదిలా ఉంటే.. పాఠశాలల్లో ఫీజుల వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి, ఉపాధ్యాయుల నియామకాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులు సక్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొన్ని పాఠశాలల్లో నిబంధనలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారా? విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెడుతున్నారు? పాఠశాలల్లో విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉందా? అనే విషయాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అంతేకాకుండా.. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో సరైన విద్యార్హతలు, శిక్షణ, అనుభవం లేని వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారనే అనుమానాలు కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకే తగిన అర్హతలు, శిక్షణ లేకపోతే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు.

తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు

లక్షల రూపాయలు.. వేల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లిస్తూ, తమ పిల్లల భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకుని, ఉపాధ్యాయులపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతూ.. ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.

అలాంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. తమకు అప్పగించిన పిల్లలపై మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉంది. పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు.. వారిని అర్థం చేసుకోవడం, వారి మానసిక స్థితిని గమనించడం, తప్పులు చేసినప్పుడు భయపెట్టకుండా సరైన మార్గంలో నడిపించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యతే.

తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో వదిలి వెళ్లిన తర్వాత.. వారి విద్యతో పాటు వారి భద్రత, మానసిక ప్రశాంతత కూడా ఉపాధ్యాయుల బాధ్యతలో భాగమే అన్న విషయాన్ని ప్రతి పాఠశాల యాజమాన్యం, ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించాలి.

ఇటీవల విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనల వంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్నారి విషయంలో జరిగిన నిర్లక్ష్యం.. ఆ కుటుంబానికి జీవితాంతం తీరని వేదనగా మిగిలిపోవచ్చు.

అందుకే ఒత్తిడి కంటే అవగాహన.. భయం కంటే భరోసా.. మార్కుల కంటే మానవత్వం పాఠశాలల్లో కనిపించాలి.

ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం

పిల్లలతో ఎలా వ్యవహరించాలి? వారి వయస్సుకు తగ్గట్టుగా ఎంత మేరకు వర్క్‌ ఇవ్వాలి? చదువులో వెనుకబడిన విద్యార్థులను ఎలా ప్రోత్సహించాలి? ఒత్తిడిలో ఉన్న చిన్నారులను ఎలా గుర్తించాలి? వంటి అంశాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పిల్లలను మార్కుల యంత్రాలుగా చూడకుండా.. భావోద్వేగాలు ఉన్న చిన్నారులుగా చూడాలి.

పాఠశాలల్లో ర్యాంకులు, మార్కులు, ఫీజుల కంటే ముందు పిల్లల మానసిక ప్రశాంతత, భద్రత, ఆనందం, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధ్యాయుల అర్హతలు, శిక్షణ, అనుభవాన్ని అధికారులు పరిశీలించడంతో పాటు.. పాఠశాలల్లో నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నదానిపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు

పసి మొగ్గలను ఒత్తిడితో వాడగొట్టకుండా.. ప్రేమతో, అవగాహనతో పెంచాల్సిన బాధ్యత పాఠశాలలదే కాదు.. అధికారులది కూడా.

చదువు భయం కాకూడదు.. భవిష్యత్తుకు బాట కావాలి.