-అల్వాల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: పెద్దమందడి, ఖిల్లా ఘనపూర్ మండలాల్లో నూతన మార్కెట్ యార్డు భవనాలు నిర్మించకుండానే పదవులను పంచుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు అల్వాల వెంకట్ రెడ్డి విమర్శించారు. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం నాయకులకు పదవులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ యార్డు భవనాలకు పరిపాలనా అనుమతులు (ప్రొసీడింగ్స్) మంజూరయ్యాయని చెబుతున్నప్పటికీ, భవన నిర్మాణాలు పూర్తి కాకముందే, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకముందే పదవులను తీసుకోవడం సరైంది కాదని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్ యార్డులు రైతులకు ఉపయోగపడే విధంగా ముందుగా భవనాలు నిర్మించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు సరైన వసతులు లేకపోయినా, కేవలం రాజకీయ నాయకులకు పదవులు పంచడం దురదృష్టకరమని విమర్శించారు.మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం అంటే రైతులకు సేవలు అందించడమే గానీ, రాజకీయ ప్రయోజనాల కోసం పదవుల పంపిణీ చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి పదవుల పంచకానికి ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమని, ముందుగా మార్కెట్ యార్డు భవనాలు నిర్మించి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే పదవుల నియామకాలు చేపట్టాలని అల్వాల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.