ఇప్పటికే వరి సాగు చేసిన రైతులను నష్టపోకుండా అవసరమైన మేరకు నీరు అందించాలి
ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలి.. నీటి లభ్యతపై ముందస్తు అవగాహన కల్పించాలి
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సూచించిన
-వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన బుధవారం రోజు నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, రాబోయే రోజుల్లో సాగు–తాగునీటి అవసరాలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కొంతమేర నీటిని విడుదల చేయగలిగితే ఇప్పటికే వరి సాగు చేపట్టిన రైతులు నష్టపోకుండా బయటపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా కొత్తకోట మండలంలోని శంకర సముద్రం రిజర్వాయర్‌ను కూడా నింపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మినుము, వేరుశనగ, ఆయిల్‌పామ్ తదితర పంటలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం కొనసాగితే రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇన్‌ఫ్లో తగ్గిన సందర్భంలో ఆన్–ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. నీటి విడుదలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలి: మంత్రి వాకిటి శ్రీహరి మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… జిల్లాలోని ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తోంది, ఎంత నీటిని విడుదల చేస్తున్నారు, ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది అనే వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అందించగలిగే సహాయం, నీటి లభ్యత వంటి వాస్తవ పరిస్థితులను స్పష్టంగా తెలియజేసి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. జూరాల, నెట్టెంపాడు నుంచి ఆన్–ఆఫ్ విధానంలో నీరు ఇవ్వాలి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి ఆన్–ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయాలని కోరారు. జూరాల కుడి ప్రధాన కాలువ ద్వారా కనీసం వారానికి మూడు రోజులైనా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… ఇప్పటికే బోర్ల ఆధారంగా వరి సాగు చేసిన రైతులకు ఆన్–ఆఫ్ విధానంలో నీటిని అందించడం ద్వారా బోర్లు రీచార్జ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ రైతులకు నీటి విడుదలపై స్పష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని కోరారు. ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటల ప్రణాళిక: కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ… కాలువల్లోకి నీరు విడుదల చేసిన వెంటనే రైతులు వరి నాట్లు వేసే అవకాశం ఉన్నందున, భవిష్యత్ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటల ఎంపిక చేసుకునేలా రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల్లో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళిక రూపొందించుకునేలా రైతులను చైతన్యపరచాలని, తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.