POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 1:53 pm Posted by : POLITICAL POWER

రైతుల దుస్థితిపై ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

అర్హతలేని ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలకే కాంట్రాక్టులు 

–తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వగృహంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుండగా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అర్హతలు లేని ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలకు కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే ధాన్యం రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. లారీలు, ట్రక్కులు కూడా లేని వారికి ట్రాన్స్‌పోర్ట్ టెండర్లు కట్టబెట్టారని, ఒకే ఏజెన్సీకి పలుచోట్ల అవకాశాలు కల్పించారని విమర్శించారు. పక్షపాత ధోరణితో కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లకే ధాన్యం కేటాయించారని ఆరోపిస్తూ, ట్రాన్స్‌పోర్ట్ టెండర్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను డిమాండ్ చేశారు. కెసిఆర్ పాలనలో ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని, కానీ ప్రస్తుతం రైతులను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం మొత్తం ధాన్యం కొనుగోలు చేశామని చెప్పడం బాధ్యతారాహిత్యమని అన్నారు. యూరియా కోసం కూడా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 57 మిల్లులపై పంచనామా చేసినప్పటికీ కేవలం 34 మిల్లులపైనే చర్యలు తీసుకున్నారని, అధికార పార్టీకి చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. కొన్ని పెద్ద మిల్లర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను నష్టపరిచారని అన్నారు. రైతుల నుంచి తరుగు, తాళ్లు తీసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీనిపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే, శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ నిందితులను పట్టుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని నిరంజన్ రెడ్డి విమర్శించారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడంలో చురుకుగా వ్యవహరించే ప్రభుత్వం, హత్య కేసు దర్యాప్తులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. వెంటనే హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మార్కెట్ యార్డ్‌లో రైతులను పరామర్శించిన మాజీ మంత్రి

ఆదివారం రోజు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరామర్శించారు. నోటికాడికి వచ్చిన పంట నీటిపాలు కావడం బాధాకరమని పేర్కొంటూ, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.