POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 12:53 pm Posted by : POLITICAL POWER

రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం: ఎంపీ ఈటల రాజేందర్

స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.                      మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

హుస్నాబాద్ నియోజకవర్గం: చిగురుమామిడి: తెలంగాణలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, రైతుబంధు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, మహిళలకు 2500 లతో పాటు వివిధ హామీలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతులకు కనీసం ఎనిమిది గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని, తరచూ విద్యుత్ ట్రిప్పింగ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.

రైతుబీమా పథకం పరిస్థితి కూడా అయోమయంగా మారిందని, ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. ఉపాధి లేక, తాగునీరు లేక, పంటలకు భరోసా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా వెళ్లకుండా వాటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులను నింపాలని తాను మొదటి నుంచే ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని, ప్రభుత్వం ఇకనైనా రాజకీయాలు, డ్రామాలు పక్కనపెట్టి రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.

అసెంబ్లీ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పవిత్ర వేదిక అని, రైతుల సమస్యలు, విద్యుత్ పరిస్థితి, ఎండిపోతున్న పంటలు, రైతు బీమా, రైతు బంధు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ఆరోపణలకే పరిమితం కావడం సరికాదన్నారు.

భారతీయ జనతా పార్టీ.. ప్రజలు, రైతుల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. విద్యుత్, సాగునీరు, రైతు బీమా, రైతు బంధు, 22-ఏ భూముల సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై బీజేపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ స్వర్గీయ గీకురు రవీందర్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు

మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రవీందర్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.                                                             ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి బొడిగె శోభ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కందుల సంధ్యారాణి, జమ్మికుంట మాజీ జడ్పీటీసీ శ్రీ శ్రీరాం శ్యామ్, కాటారం సింగిల్ విండో చైర్మన్ శ్రీ చల్లా నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జన్నాపురెడ్డి సురేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ ఎర్రబెల్లి సంపత్ రావు, నాయకులు శ్రీ చొప్పరి వేణు, శ్రీ పిట్టల రవీందర్, శ్రీ జీడి మల్లేష్, శ్రీ బండి కళాధర్, శ్రీ కరుణాకర్, శ్రీ పల్లె వెంకట్ రెడ్డి, శ్రీ కొమ్ము అశోక్ యాదవ్, శ్రీ పిల్లి సతీష్ ముదిరాజ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.