POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:41 pm Posted by : POLITICAL POWER

రోడ్డుపై గాజు ముక్కలు.. సర్పంచ్ స్పాట్ యాక్షన్

ప్రజల భద్రతకు తక్షణ చర్యలు.. రోడ్డును శుభ్రం చేయించిన రమాదేవి రాంబాబు

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 03: మండల కేంద్రంలోని ఎయిర్‌టెల్ టవర్‌ సమీపం నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తులు గాజు సీసాలను పగలగొట్టి రోడ్డుపై పడేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న గాజు ముక్కల కారణంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది.

ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై గాజు ముక్కలు ఉండటం వల్ల ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా శుభ్రత చర్యలు చేపట్టారు.

జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను తొలగించి రహదారిని సదును చేయించారు. అనంతరం పగిలిన గాజు సీసాలు, గాజు ముక్కలను సర్పంచ్ స్వయంగా తొలగించడంతో పాటు పంచాయతీ సిబ్బందితో వాటిని పూర్తిగా తరలించారు. రహదారిపై ఎక్కడా గాజు ముక్కలు మిగలకుండా పరిశీలించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలపై సమాచారం అందిన వెంటనే స్పందించి పరిష్కరించేందుకు పంచాయతీ తరఫున చర్యలు తీసుకుంటామని సర్పంచ్ రమాదేవి తెలిపారు. ముఖ్యంగా రోడ్లపై గాజు సీసాలు, చెత్తాచెదారం వేయకుండా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భద్రతకు ఆటంకం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించవద్దని కోరారు.


రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గాజు ముక్కలను తొలగించి వెంటనే రహదారిని శుభ్రం చేయించిన సర్పంచ్ చర్యలను స్థానికులు అభినందించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కార చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.