POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 10:31 pm Posted by : POLITICAL POWER

రౌడీయిజానికి చెక్.. నేరస్తులకు జిల్లా బహిష్కరణ

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

–ఎస్‌పీ నచికేత్ విశ్వనాథ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా ప్రతినిధి, జూన్ 17 2026: జిల్లాలో రౌడీయిజాన్ని ఏమాత్రం సహించబోమని, పదేపదే నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్‌తో పాటు జిల్లా బహిష్కరణ చర్యలు కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పులివెందుల, మైదుకూరు సబ్‌డివిజన్ల నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ… జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాల వినియోగాన్ని పెంచి నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా సీఏఆర్, ఈ-సాక్ష్య, సీసీటీఎన్‌ఎస్, ఈ-సమ్మన్స్, ఈ-ప్రాసిక్యూషన్స్, సీసీటీవీ-360 వంటి మాడ్యూళ్లపై అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్‌పీ ఆదేశించారు. ముఖ్యంగా మలుపుల వద్ద వేగ నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. లాడ్జీలలో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. విద్యాసంస్థల పరిసరాల్లో ఈవ్‌టీజింగ్ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించాలని సూచించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో బి. మురళి, జి. రాజేంద్ర ప్రసాద్తో పాటు పులివెందుల, మైదుకూరు సబ్‌డివిజన్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.