POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 3:57 am Posted by : POLITICAL POWER

వరసిద్ధి వినాయకుని వార్షికోత్సవంలో ఘనంగా అన్నసమారాధన

 

వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. భక్తిశ్రద్ధలతో 21వ వార్షికోత్సవ వేడుకలు   

బలభద్రపురం: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని చెరువువీధిలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకుని 21వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నసమారాధన భక్తజన సందోహం మధ్య ఘనంగా జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తుల రాకకు అనుగుణంగా ఆలయ కమిటీ ముందస్తు ఏర్పాట్లు చేయడంతో అన్నసమారాధన ప్రశాంతంగా కొనసాగింది.

భక్తులకు అన్నప్రసాదంతో పాటు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. కార్యక్రమం మొత్తం ఆలయ కమిటీ సభ్యులు, యువత సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దాతల సహకారంతో నిరంతర సేవ

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సబ్బెళ్ల రామారెడ్డి మాట్లాడుతూ.. చెరువువీధి వరసిద్ధి వినాయకుని నవరాత్రి ఉత్సవాలను 21 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం వల్లే అన్నసమారాధనను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని పేర్కొన్నారు.

ఈ ఏడాది అన్నసమారాధనకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తూ నిర్విరామంగా సేవలందించిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, చిన్నారులు, చెరువువీధి యువతను అభినందించారు.

ముఖ్యంగా యువత సమష్టిగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉందన్నారు.

వరసిద్ధి వినాయకుని కృపతో గ్రామ ప్రజలు, భక్తులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.