కమలాపురం ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.. ఆర్‌ఓ ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశం
పొలిటికల్ పవర్,ములకలపల్లి, నవంబర్ 3: మండలంలోని కమలాపురం ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వంటశాల, ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలు, భోజన సమయాలపై వివరాలు తెలుసుకున్నారు
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని, వంటశాల, స్టోర్ రూమ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలనే వంటకు ఉపయోగించాలని, ఆహార కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం పాఠశాలలోని తాగునీటి సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్.. ఆర్‌ఓ ప్లాంట్ పనిచేయకపోవడంపై ఆరా తీశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, విద్యార్థులకు నిరంతరం శుభ్రమైన తాగునీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ స్వాతి బిందు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున
