చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: పెద్దమందడి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే), వనపర్తి మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలంలోని వీరాయిపల్లి గ్రామంలో వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలు, వ్యాధుల నిర్ధారణ కోసం క్షేత్ర సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌వీకే కో-ఆర్డినేటర్ ఎన్. నవత, పెద్దమందడి మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ సంయుక్తంగా రైతుల పొలాలను సందర్శించారు. పంటల ఎదుగుదల, పోషక లోపాలు, చీడపీడలు, వ్యాధుల ఉధృతి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి రైతులతో ప్రత్యక్షంగా చర్చించారు.
క్షేత్ర పరిశీలనలో వరి పంటలో పొటాష్ (K) లోపం, BLB, నల్లి, కాండం తొలిచే పురుగు ఉధృతిని గుర్తించారు. పొటాష్ లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున 13-0-45 ను ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. BLB నివారణకు ప్లాంటమైసిన్ 100 గ్రాములు/ఎకరం, నల్లి నివారణకు ఓబేరోన్ 200 మి.లీ./ఎకరం చొప్పున పిచికారీ చేయాలని సూచించారు.
కాండం తొలిచే పురుగు నివారణకు ముందస్తు చర్యగా ఫెరోమోన్ ట్రాప్‌లు ఏర్పాటు చేయాలని, పురుగు ఉధృతి ఆర్థిక నష్టం స్థాయిని దాటినప్పుడు క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్‌సీ @ 60 మి.లీ./ఎకరం లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ @ 10 కిలోలు/ఎకరం వినియోగించాలని రైతులకు సూచించారు.
వేరుశనగ పంటలో రసాన్ని పీల్చే పురుగుల ఉధృతి గమనించిన నేపథ్యంలో పసుపు రంగు స్టిక్కీ ట్రాప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్‌ఎల్ @ 60 మి.లీ./ఎకరం, థయామెథాక్సామ్ 25 డబ్ల్యుజీ @ 40 గ్రాములు/ఎకరం లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ./లీటర్ నీటికి పిచికారీ చేయాలని సూచించారు. రైతులు సకాలంలో విత్తడం, విత్తన శుద్ధి చేయడం, పంటలను క్రమం తప్పకుండా పరిశీలించడం వంటి సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను పాటించాలని అధికారులు సూచించారు. చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు సిఫార్సు చేసిన పద్ధతులను మాత్రమే అనుసరించడం ద్వారా పంట నష్టాలను తగ్గించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌వీకే వనపర్తి కో-ఆర్డినేటర్ ఎన్. నవత, పెద్దమందడి మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.