POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 9:31 pm Posted by : POLITICAL POWER

వెయ్యి రోజుల ప్రజా పాలన.. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్‌ బాటలు

అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు

దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముళ్ళపూడి వెంకటేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్‌ 3:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దమ్మపేట మండల కాంగ్రెస్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ ముళ్లపూడి వెంకటేశ్వరరావు కార్యకర్తలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే రైతులకు రైతుబంధు, రైతుబీమా చెల్లింపులతో పాటు గ్రామాల్లో కొత్త సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాల భవనాలు, ప్రహరీ గోడలు, చెరువుల మరమ్మతులు, కల్వర్టులు, వంతెనలు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. కొత్త గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా శక్తి భవనాలు నిర్మించడంతో పాటు బోర్లు, హ్యాండ్‌పంపులు, సోలార్‌, హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, మహిళలకు 50 శాతం సబ్సిడీతో వివిధ ఉపాధి అవకాశాలు కల్పించడం, పెట్రోల్‌ బంకుల నిర్మాణం, టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీతో పాటు పింఛన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులకు సహాయం అందిస్తున్నామని అన్నారు.

దేవాలయాలు, మసీదుల అభివృద్ధి, అడవుల సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముళ్లపూడి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు, మండల ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు.