Date of Publish : 18 September 2026, 6:29 pmPosted by : POLITICAL POWER
వెల్టూర్ స్టేజి వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలి
ఎమ్మెల్యే మేఘా రెడ్డికి గ్రామ యువకుల వినతి
ఆర్టీసీ ఆర్‌ఎంకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026:పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజి వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వెల్టూర్ గ్రామానికి చెందిన యువకులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించడంతో రెండు మూడు రోజుల పాటు ఎక్స్‌ప్రెస్ బస్సులు వెల్టూర్ స్టేజి వద్ద ఆగాయని, అనంతరం మళ్లీ బస్సులు నిలపడం లేదని యువకులు తెలిపారు. వెల్టూర్ స్టేజి వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపకపోవడంతో గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎక్స్‌ప్రెస్ బస్సుల సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. యువకుల వినతిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంటనే స్పందించి వనపర్తి ఆర్టీసీ ప్రాంతీయ రవాణా అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెల్టూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు పది వేల మంది జనాభా ఉన్నారని, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెల్టూర్ స్టేజి వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను తప్పనిసరిగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంకు సూచించారు. వనపర్తి–గద్వాల మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాంతానికి రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ బస్సులను కూడా వెల్టూర్ స్టేజి వద్ద నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్‌ఎంకు సూచించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందించి ఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలకు సూచించడంపై వెల్టూర్ గ్రామ యువకులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.