12 గంటల విద్యుత్ హామీ.. ఆరు గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదంటూ రైతుల ఆగ్రహం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామ పెద్దగూడెం రైతులు ఆందోళనకు దిగారు. కడుకుంట్ల గ్రామ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట, కడుకుంట్ల–వనపర్తి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా, నాణ్యమైన విద్యుత్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా బోర్లు, మోటార్లు పనిచేయక పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. గతంలో విద్యుత్ అందుబాటు తక్కువగా ఉన్న సమయంలోనూ అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేశారని రైతులు గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ రైతులను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో సరిపడా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎలక్ట్రికల్ డీఈ శ్రీనివాసులు రైతులకు వివరించినట్లు తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఎలక్ట్రికల్ డీఈ శ్రీనివాసులు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేమాణిక్యం, రఘు వర్ధన్ రెడ్డి, మాధవరెడ్డి, ధర్మ నాయక్, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, లక్ష్మీకాంత్ రెడ్డి, టి సర్పంచ్ తిరుపతయ్య, మాజీ సర్పంచ్ హరిత బాలకృష్ణ, మాజీ సర్పంచ్ కొండయ్య, కృష్ణ నాయక్, మనీష్, గ్రామ అధ్యక్షులు వెంకటేష్ అశోక్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.