POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:46 am Posted by : POLITICAL POWER

శిరీష మృతిపై నిజాలు తేల్చాలి

అశ్వారావుపేటలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన

న్యాయం కోసం గళమెత్తిన గిరిజనులు, మహిళలు

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 01 2026: హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ మృతి చెందిన ములకలపల్లి మండలం చెవిటిగూడెం గ్రామానికి చెందిన ఊకె శిరీషకు న్యాయం చేయాలని కోరుతూ అశ్వారావుపేటలో సోమవారం భారీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రింగ్‌రోడ్డు సెంటర్‌లోని కొమరం భీం విగ్రహం వద్ద ప్రారంభమైన ప్రదర్శన పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకున్న ప్రజలు శిరీషకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. శిరీష మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. మృతికి ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి న్యాయం చేయడంతో పాటు కుటుంబానికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వొత్తుల ప్రదర్శనకు ప్రస్తుత, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటానికి మద్దతుగా నిలుస్తామని పలువురు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అశ్వారావుపేట ప్రధాన వీధులు న్యాయం కోసం చేసిన నినాదాలతో మార్మోగాయి.