POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 1:27 pm Posted by : POLITICAL POWER

శ్రీశైల క్షేత్రంలో ఉచిత బస్సు సదుపాయం: ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు

శ్రీశైలం (పొలిటికల్ పవర్ – పిఎన్9 టీవీ):

కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తరఫున ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీ యం. శ్రీనివాసరావు తెలిపారు. నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఈ ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాతాళగంగ మెట్లమార్గం నుంచి ప్రారంభమై నందిసర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్ మీదుగా లడ్డూ విక్రయ కౌంటర్ల వరకు ఈ బస్సులు నిరంతరం నడుస్తాయని స్పష్టం చేశారు.

ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు భక్తులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పుణ్యక్షేత్రానికి తరలివచ్చే శివస్వాములు, పవిత్ర కార్తీక స్నానాలు ఆచరించే భక్తులు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.