శ్రీశైలం (నంద్యాల జిల్లా), నవంబర్ 12 (పొలిటికల్ పవర్ న్యూస్):
ద్వాదశ జ్యోతిర్లింగ, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అత్యంత వైభవంగా ఊయలసేవ నిర్వహించనున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి శుక్రవారం, పౌర్ణమి మరియు మూలానక్షత్రం రోజులలో ఈ విశేష సేవను కనులపండువగా జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.
శాస్త్రోక్తంగా పూజా క్రతువులు:
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణార్థం అర్చకస్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ సేవా సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం సేవా క్రతువు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలని ప్రార్థిస్తూ మహాగణపతి పూజను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
కనులపండువగా ఊయలసేవ, పుష్పార్చన:
తదుపరి సర్వాలంకార భూషితులై ఊయలలో వేంచేపు చేసిన శ్రీస్వామిఅమ్మవార్లకు అర్చకులు షోడశోపచార పూజలు జరిపిస్తారు. చివరగా వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామిఅమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ఊయలసేవ నిర్వహిస్తారు. ఈ విశేష సేవను పురస్కరించుకుని వివిధ రకాల రంగురంగుల సుగంధ పుష్పాలతో స్వామిఅమ్మవార్లకు కనులపండువగా పుష్పాలంకరణ, ప్రత్యేక పుష్పార్చనలు జరిపించనున్నారు.
