POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 1:40 pm Posted by : POLITICAL POWER

సగం నిర్మించి వదిలేసిన మరుగుదొడ్లు

 –అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు -బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 12 2026: పెద్దమందడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మహిళా సంఘాల కార్యాలయాలకు ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తున్నారు. అయితే ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల అవసరాల కోసం ప్రారంభించిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు సగంలోనే నిలిపివేసి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు ఖర్చు చేసినా ప్రజలకు ఉపయోగపడే స్థితికి తీసుకురాకపోవడం బాధాకరం. అంతేకాకుండా కార్యాలయ ప్రాంగణంలో కూర్చోవడానికి కుర్చీలు లేవు, ఎండా వానల నుంచి రక్షణ పొందేందుకు షెల్టర్ లేదు, తాగునీటి సదుపాయం కూడా సరిగా లేదు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు వర్షంలో తడుస్తూ, ఎండలో నిలబడుతూ తమ పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఎమ్మెల్యే సొంత మండల కేంద్రంలోనే ఈ దుస్థితి నెలకొనడం. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి పాలకుల వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. వెంటనే అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే షెల్టర్, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్ తెలిపారు.