ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, ఎటియోస్ కారు, మొబైల్ ఫోన్, నగదు సీజ్.
పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు.

పొలిటికల్ పవర్ దినపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణాను విజయవంతంగా అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన వాహన తనిఖీల్లో, ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 166 కిలోల 360 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి విలువ సుమారు రూ.89 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఆపరేషన్‌లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, గంజాయి తరలింపునకు ఉపయోగించిన ఎటియోస్ కారు, ఒక మొబైల్ ఫోన్, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్, సత్తుపల్లి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. అరెస్ట్ అయిన నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.