సత్తుపల్లి ఫుడ్ పార్క్ క్షేత్రస్థాయి పరిశీలనలో బిజెపి జాతీయ నాయకులు,
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం.
రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టారా?.
రూ.109 కోట్ల ఫుడ్ పార్క్ అక్రమాలపై సీబీఐ, సీవీసీ దర్యాప్తు జరగాలి.
ఆంధ్రా కంపెనీకి, ‘దీపక్ నెక్స్ జెన్’కు సగం ధరకే భూములా?.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఏ హరిబాబు / బుగ్గపాడు సత్తుపల్లి ఖమ్మం జిల్లా జూన్ 17 బుధవారం .వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి కోసం, స్థానిక రైతులకు అండగా నిలుస్తుందనే ఆశతో ఏర్పాటు చేసిన సత్తుపల్లి మెగా ఫుడ్ పార్క్ చివరకు పెద్ద కుంభకోణానికి వేదికగా మారిందని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని ఫుడ్ పార్క్‌ను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలను, నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ పార్క్ వ్యవహారంలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ఈ భారీ అక్రమాల వెనుక ఈ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ కింద కోల్డ్ స్టోరేజీతో కూడిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్ ల కోసం, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రూ.109.50 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేశారని పొంగులేటి గుర్తు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించి తన వంతుగా ఏకంగా రూ.49.70 కోట్ల భారీ నిధులను కేటాయించిందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కేవలం భూములను సేకరించి ఇవ్వడం మాత్రమేనని, కానీ ఆ ప్రక్రియలోనే పాలకులు అత్యంత దారుణమైన అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. స్థానిక రైతుల నుంచి కేవలం లక్ష, రెండు లక్షల రూపాయల చొప్పున అత్యంత తక్కువ ధరకే భూములను గుంజుకుని, ఈ రోజు వాటిని కార్పొరేట్ శక్తులకు యథేచ్ఛగా ధారాదత్తం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. తమకు సరైన పరిహారం రాకపోయినా, భవిష్యత్తులో ఈ పార్క్ ద్వారా తమ పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే పవిత్ర ఆశయంతోనే రైతులు తమ ప్రాణప్రదమైన భూములను ప్రభుత్వానికి అప్పగించారని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చివరకు ఆ నిరుపేద రైతుల ఆశలను అడియాశలు చేస్తూ, పారదర్శకతకు పూర్తిగా పాతరవేశారని మండిపడ్డారు. అసలు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, ఆంధ్రాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి ఏకంగా 84 ఎకరాల భూమిని కేటాయించడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. దీనితో పాటు దీపక్ నెక్స్ జెన్ కంపెనీకి మార్కెట్ ధరలో సగానికంటే తక్కువ ధరకే భూములను అప్పగించడం వెనుక ఎవరి హస్తం ఉందో, ఎవరికి ఎంత ముడుపులు ముట్టాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం కేబినెట్ అప్రూవల్ (మంత్రిమండలి ఆమోదం) పొందిన తర్వాతే జరగాల్సిన ఇటువంటి కీలకమైన భూకేటాయింపులు, ఎవరి ప్రమేయంతో, ఎవరి ఒత్తిళ్లతో చట్టవిరుద్ధంగా జరిగిపోయాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ఈ ఫుడ్ పార్క్ ఉదంతంలో జరిగిన ప్రతి ఒక్క అక్రమాన్ని బయటకు తీయాల్సిందేనని, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే దీనిపై పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారుల ముసుగులు తొలగించి, వారిని సమాజం ముందు నిలబెట్టే వరకు బీజేపీ విశ్రమించబోదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ద్వారా సమగ్ర దర్యాప్తు చేయిస్తామని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత కూడా దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేశారు. తాను ఈ జిల్లా వాసిగా ఇక్కడి రైతులకు జరిగిన అన్యాయాన్ని, దోపిడీని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు క్షేత్రస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
అంతకుముందు సత్తుపల్లి సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నలగడ్డ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు,జిల్లా కార్యదర్శి వీరంరాజు, సత్తుపల్లి మండల, పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్, శాలి శివకృష్ణ, వేంసూర్ మండల అధ్యక్షులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు పరస రాంబాబు, రఘునాథరెడ్డి, భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, బండి వెంకటరెడ్డి, నల్లమోతు నాని బాబు, కొప్పుల మధుసూదన్ రెడ్డి , వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.