POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:16 pm Posted by : POLITICAL POWER

సర్పంచు నుంచే వచ్చా ప్రజా సమస్యలు తెలుసు.. 

నిర్లక్ష్యం చేసే అధికారులను ఉపేక్షించేది లేదు

ఆస్తులు కాదు.. పిల్లలకు ఉన్నత విద్యను అందించండి

ఏఈ, ఎంఈఓ లకు మెమోలు జారీ చేయాలని ఆదేశాలు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: శనివారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రేవల్లి, ఏదుల మండల సర్వసభ్య సమావేశాల్లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల పనితీరుపై విస్తృతంగా సమీక్షించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులే ప్రత్యక్షంగా సభ దృష్టికి తీసుకొస్తున్నారని, అందువల్ల అధికారులు ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రైతులకు యూరియాకొరత లేకుండా చూడాలి యూరియా పంపిణీలో ఆన్‌లైన్ సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే పరిష్కారం చూపాలని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. అవసరమైన సమయంలో రైతులకు యూరియా, ఎరువులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలు ఫార్మ్ పాండ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలి ఎల్నీనో వంటి పరిస్థితులను అధిగమించాలంటే ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. భూగర్భ జలాల సంరక్షణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యే శాశ్వత ఆస్తి – ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యంతో అభివృద్ధి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయిలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్తులు కాదు… పిల్లలకు అందించే ఉన్నత విద్యే జీవితాంతం నిలిచే సంపద అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం సహించం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ రంగంలో రూ.180 కోట్ల అభివృద్ధి పనులు వనపర్తి నియోజకవర్గంలో గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ప్రస్తుతం మరో రూ.40 కోట్ల పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ నిధులు సాధించిన నియోజకవర్గాల్లో వనపర్తి మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పూర్తి సహకారం అందించాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. మట్టి, ఇసుక తరలింపులో ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రమే నిర్మాణానికి అనుమతి పత్రంగా పరిగణించి అన్ని శాఖలు సహకరించాలని సూచించారు.

మిషన్ భగీరథపై తీవ్ర విమర్శలు

గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ నేటికీ గ్రామాల్లో తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. ఇప్పటికీ పాత బోర్లు, పైప్‌లైన్ల ద్వారానే అనేక గ్రామాలకు తాగునీరు అందుతోందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ప్రజలకు కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి “కమిషన్ భగీరథ”గా మిగిలిపోయిందని విమర్శించారు. భూభారతితో రైతుల భూ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం ధరణి పోర్టల్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ద్వారా భూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తోందని తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వెంటనే సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పశువైద్య సేవలు గ్రామస్థాయిలోఅందుబాటులో ఉండాలి పశువైద్య అధికారులు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి పశువులకు అవసరమైన వైద్యం, మందులు, గడ్డి విత్తనాలు సకాలంలో అందించాలని సూచించారు. 45 రోజులకు ఒకసారి సర్వసభ్య సమావేశాలు – గైర్హాజరైన అధికారులపై చర్యలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి 45 రోజులకు ఒకసారి సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరయ్యే లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై మెమోలు జారీ చేసి అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఈ, ఎం ఈ ఓ లపై మెమోలు జారీ చేయాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలం మార్కెట్ యార్డ్ అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు సత్యశీలారెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.