Date of Publish : 22 September 2026, 5:25 pmPosted by : POLITICAL POWER
సార్ ప్రక్రియతో 43.98 లక్షల ఓట్లపై ఉత్కంఠ
నోటీసులు అందుకున్న వారిలో 53.62 శాతం మంది విచారణకు గైర్హాజరు
కొడంగల్‌లో 96 శాతం మంది స్పందించని పరిస్థితిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 22 2026:హైదరాబాద్ తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓటర్లు నోటీసులకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 82.02 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, వారిలో 43.98 లక్షల మంది అంటే 53.62 శాతం మంది గడువులోగా గుర్తింపు పత్రాలతో విచారణకు హాజరు కాలేదు. మొత్తం 38 లక్షల మంది విచారణకు హాజరుకాగా, వారిలో 27.44 లక్షల మంది అవసరమైన పత్రాలు సమర్పించి అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన కేసుల పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 66,342 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వగా, 63,984 మంది అంటే దాదాపు 96 శాతం మంది విచారణకు హాజరు కాలేదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3.03 లక్షల మందికి నోటీసులు ఇవ్వగా, 2.48 లక్షల మంది స్పందించలేదు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్–మల్కాజ్‌గిరిలో 8,31,316 మంది, రంగారెడ్డిలో 6,03,149 మంది, హైదరాబాద్‌లో 5,13,264 మంది నోటీసులకు స్పందించలేదు. సంగారెడ్డిలో 2,24,058 మంది, నిజామాబాద్‌లో 1,64,435 మంది, వికారాబాద్‌లో 1,63,603 మంది, సూర్యాపేటలో 1,50,671 మంది స్పందించని వారిలో ఉన్నారు. అదేవిధంగా నల్గొండలో 1,49,754 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 1,41,726 మంది, మహబూబ్‌నగర్‌లో 1,31,249 మంది, వరంగల్‌లో 1,16,165 మంది, నిర్మల్‌లో 1,06,965 మంది, కరీంనగర్‌లో 1,01,945 మంది నోటీసులకు స్పందించలేదు. అయితే నోటీసులకు స్పందించని వారందరి ఓట్లు తక్షణమే తొలగించినట్లు భావించాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రక్రియలో పునర్విచారణ, క్లెయిమ్స్–ఆబ్జెక్షన్స్ వంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో తుది ఓటర్ల జాబితా ప్రక్రియ అక్టోబర్‌లో పూర్తికానుంది. విచారణకు హాజరుకాని పరిస్థితికి నోటీసులు సక్రమంగా అందకపోవడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, అవసరమైన పత్రాలపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ఉన్నట్లు అధికారులు, సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘం సూచించిన పత్రాల జాబితాలో ప్రభుత్వ గుర్తింపు కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, విద్యా ధ్రువపత్రాలు, శాశ్వత నివాస ధ్రువపత్రం, ఆధార్ తదితర పత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పేర్లు, నోటీసు వివరాలు, విచారణ తేదీ తదితర అంశాలను అధికారిక ఎన్నికల వనరుల ద్వారా పరిశీలించుకుని, అవసరమైతే నిర్ణయించిన ప్రక్రియలో తమ అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌ను నమోదు చేసుకోవడం కీలకంగా మారింది.