ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 5 2026: వనపర్తి జిల్లా కేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి పేరుతో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (SDF) నుంచి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ Proceedings No: DySO1/05/SDF (DIM)/WNP AC/2023-24 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి పర్యటన సందర్భంగా స్థానిక జర్నలిస్టులు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు శాశ్వత వేదికగా ఉపయోగపడే విధంగా సురవరం ప్రతాపరెడ్డి పేరుతో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలని కోరారు. జర్నలిస్టుల విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేయించారు. అనంతరం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ ప్రెస్ క్లబ్ భవనం జర్నలిస్టుల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడటంతో పాటు ప్రజలకు, మీడియాకు మధ్య సమర్థవంతమైన సమాచార వేదికగా నిలవనుంది. ఈ సందర్భంగా జర్నలిస్టుల అభ్యర్థనను వెంటనే మన్నించి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మీడియా అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.