తాతా మధుసూదన్‌ను శాసన మండలి నుంచి తొలగించాలి
మాజీ సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి: పామిరెడ్డిపల్లి సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దళిత స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నేత తాతా మధుసూదన్ అనుచితంగా, అమర్యాదకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత గౌరవం కలిగిన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా దుర్భాషలాడటం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కల్పించినప్పటికీ, ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష బాధ్యతలను విస్మరించి వీధి రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుసూదన్‌ను తక్షణమే శాసన మండలి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలతో కలిసి కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను వేలాది డప్పులతో ముట్టడించే కార్యక్రమానికి సిద్ధమవుతామని మంజుల శ్రీశైలం హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ నేతల తీరును గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, తెలంగాణ ప్రజలు ఇకపై బీఆర్‌ఎస్ నేతలను ఫామ్‌హౌస్ రాజకీయాలకే పరిమితం చేస్తారని ఆమె వ్యాఖ్యానించారు.