Date of Publish : 08 September 2026, 3:52 pmPosted by : POLITICAL POWER
హామీలు అడిగితే అక్రమ అరెస్టులా?
మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను భేషరతుగా విడుదల చేయాలి: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026:వనపర్తి అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్‌రెడ్డిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం మహిళల చేత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. హామీల అమలుపై నిరసన వ్యక్తం చేసేందుకు నల్ల దుస్తులతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేయడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి చేసి గాయపరచడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన అన్నారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతబట్టి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేయవచ్చని, అదే విధంగా తాము నిరసన తెలిపితే తప్పేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానీయకుండా అడ్డుకోవడం ఏమిటని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షం సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతోనే సభ బయటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. రెండుసార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోందని ఆయన ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకు ఉద్యమిస్తామని వారు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ ఇసాక్ మాట్లాడుతూ.. నిత్యం మహిళా పక్షపాతి అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మహిళల ఆగ్రహం తప్పదని అన్నారు. ప్రజల నుంచి వస్తున్న నిరసనలను తట్టుకోలేక ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వం క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.