POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:51 pm Posted by : POLITICAL POWER

హుకుంపేటలో వైసిపికి భారీ షాక్: గడ్డికించుమండలో టిడిపిలోకి మాజీ సర్పంచులు.. ఏజెన్సీలో వైసిపి పతనం తప్పదన్న దొన్నుదొర

పొలిటికల్ పవర్ సమగ్ర జాతి తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా బ్యూరో పి ఎల్ మూర్తి హుకుంపేట: హుకుంపేట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. మండల పరిధిలోని గడ్డికించుమండ గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వైసిపికి చెందిన పలువురు మాజీ సర్పంచులు, కీలక నాయకులు తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి విజయనగరం జోనల్ చైర్మన్, అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో గడ్డికించుమండ మాజీ సర్పంచ్ వార్తన ఈశ్వరమ్మ, బారమస్య మాజీ సర్పంచ్ లకే రూపాదేవి, మాజీ సూపర్ సర్పంచ్ బెటికేరి మత్స్యరాజుతో పాటు పలువురు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. దొన్నుదొర వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా టిడిపిలో చేరిన మాజీ సర్పంచులు మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. ప్రజలు తమపై నమ్మకంతో ఎన్నుకున్నప్పటికీ గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. పంచాయతీల అభివృద్ధి కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినా సరైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సర్పంచులుగా అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాభివృద్ధికి అవకాశాలు ఏర్పడుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమనే విశ్వాసంతో దొన్నుదొర నాయకత్వంలో టిడిపిలో చేరినట్లు వెల్లడించారు. అనంతరం దొన్నుదొర మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో వైసిపి పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరడం ఇందుకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రతినిధులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీని విశ్వసించి చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన దొన్నుదొర, రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల నుంచి నాయకులు టిడిపిలో చేరనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, తెలుగు యువత, తెలుగు మహిళా విభాగాల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ చేరికలతో హుకుంపేట మండలంలో టిడిపి మరింత బలోపేతమైందని, ఏజెన్సీ ప్రాంత రాజకీయాల్లో ఇది కీలక పరిణామమని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.