సారంగపల్లి అడవి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మందమర్రి, జూన్ 12 :
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపల్లి అటవీ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని పురుషుడి అస్థిపంజరం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సారంగపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి కేశవగేని బాలయ్య అనే వ్యక్తి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన మేకలను మేపడానికి సారంగపల్లి అటవీ లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో అడవిలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి, కేవలం అస్థిపంజరం రూపంలో పడి ఉండటాన్ని గమనించాడు. భయాందోళనకు గురైన బాలయ్య వెంటనే ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలి రాములుకు సమాచారం అందించాడు.
సర్పంచ్ ద్వారా విషయం తెలుసుకున్న సారంగపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి (పంచాయతీ సెక్రటరీ) పుప్పాల సవ్య, సర్పంచ్ మరియు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ కేవలం తల భాగం (పుర్రె), చేతులు, కాళ్ళ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్న అస్థిపంజరాన్ని గుర్తించారు. మృతదేహం పక్కన లేత నీలం రంగు ప్యాంటు, దానికి బెల్టు ధరించి ఉంది. మృతదేహంపై చర్మం, మాంసం ఏమీ లేకుండా పూర్తిగా అస్థిపంజరంగా మారిపోవడంతో, అడవి జంతువులు మృతదేహాన్ని తినివేసి ఉంటాయని భావిస్తున్నారు.
ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య మందమర్రి పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని, సదరు వ్యక్తి ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం లభించిన ప్రాంతాన్ని క్లూస్ టీమ్ మరియు ఉన్నతాధికారులు సందర్శించి ఆధారాలు సేకరిస్తున్నారు.
