పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: వనపర్తి జిల్లా మదనాపురం మండలం పరిధిలోని కొన్నూర్ తండాలో 108 అత్యవసర సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక గర్భిణికి ఇంటి వద్దనే సుఖ ప్రసవం చేశారు. ఈ ఘటనలో తల్లి, మగబిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివరాలకు వెళితే… మండలం పరిధిలో కొన్నూర్ తండాకు చెందిన కస్తూరి, భర్త హనుమంతు, వయస్సు 21 అనే గర్భిణికి గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హఠాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే మదనాపురం 108 అంబులెన్స్ సిబ్బంది అయిన ఈఎంటి రాములు, పైలట్ రవి క్షణాల్లో బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే కస్తూరికి నొప్పులు తీవ్రం కావడంతో, ఆసుపత్రికి తరలించే సమయం లేకపోవడాన్ని గమనించిన సిబ్బంది ఆలస్యం చేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. నిపుణులైన సిబ్బంది చొరవతో ఇంటి వద్దనే కాన్పు చేయగా, కస్తూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం తల్లి, బిడ్డలను క్షేమంగా పరీక్షించి, తదుపరి వైద్య సంరక్షణ కోసం వనపర్తి ప్రభుత్వ మాతృత్వ మరియు శిశు ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) తరలించి ఆసుపత్రిలో చేర్పించారు.
గ్రామస్తుల అభినందనలు:
సమయానికి స్పందించి, ప్రాణాపాయ స్థితి నుండి తల్లి, బిడ్డలను కాపాడిన 108 ఈఎంటి రాములు,పైలట్ రవి వారిని కాపాడినందుకు వారి సిబ్బందికి సభ్యులు, బంధువులు మరియు కొన్నూర్ తండా గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, వారి సేవలను అభినందించారు.