మల్కాజిగిరిలో ఎస్సీ వ్యక్తిని కుల దూషణ…
రద్దీగా ఉన్న రోడ్డుపై చెప్పుతో కొట్టి భౌతిక దాడి!!
మల్కాజిగిరి: 11 ఆగస్టు (పొలిటికల్ పవర్ న్యూస్)
హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో షెడ్యూల్డ్ కులానికి (మాల) చెందిన ఒక కార్ డ్రైవర్ పై తీవ్రమైన కుల వివక్ష, భౌతిక దాడి మరియు ప్రాణ బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుడైన సాయి కిరణ్ (36) తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అతని కులాన్ని నిందిస్తూ సమాజంలో చులకన చేసేలా రద్దీగా ఉన్న ప్రాంతంలో భౌతిక దాడికి దిగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘాతుకానికి గుడేపు సురేష్, అతని భార్య గుడేపు సుజాత మరియు అతని తల్లి గుడేపు తారలు బాధ్యులని స్పష్టమవుతోంది.
బాధితుడు సాయి కిరణ్ ప్రస్తుతం గుడవెల్లి తేజ అనే వ్యక్తి వద్ద నమ్మకంగా కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజున, తన యజమాని ఆదేశాల మేరకు మల్కాజిగిరి పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్, తరుణ అవెన్యూ వద్ద నిలిపి ఉంచిన కారులోని ముఖ్యమైన పత్రాలను తీసుకురావడానికి అతను వెళ్లాడు. సాయి కిరణ్ కారులో ఉన్న డాక్యుమెంట్లను తీసుకుంటుండగా, గుడేపు సురేష్, అతని భార్య సుజాత మరియు తల్లి తారలు అకారణంగా అక్కడకు వచ్చి అతడిని అడ్డుకుని అత్యంత నీచమైన పదజాలంతో గొడవకు దిగారు.
బాధితుడు సాయి కిరణ్ షెడ్యూల్డ్ కులానికి చెందినవాడనని స్పష్టంగా తెలిసినప్పటికీ, నిందితులు అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ప్రజా సంచారం అధికంగా ఉన్న తరుణ అవెన్యూ ప్రాంతంలో దారిపోయే ప్రజలందరూ చూస్తుండగానే, అతడిని నీచమైన పదజాలంతో కులం పేరుతో తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా, గుడేపు సురేష్ పథకం ప్రకారం తన తల్లి గుడేపు తారను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించి, ఆమె చేత సాయి కిరణ్‌ను చెప్పుతో కొట్టించాడు. అదే సమయంలో సుజాత కూడా బాధితుడిని ముందుకు నెట్టివేసి భౌతికంగా దాడికి పాల్పడింది.
నడిరోడ్డుపై అందరి ముందూ జరిగిన ఈ ఘటనతో బాధితుడు తీవ్ర మానసిక వేదనకు, అవమానానికి గురయ్యాడు. సమాజంలో ఆత్మగౌరవంతో బతుకుతున్న తనపై దురుద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని, ఈ విషయమై పోలీసులను ఆశ్రయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలతో వదలమని బెదిరించారని బాధితుడు వాపోయాడు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, కుల వివక్షతో భౌతిక దాడికి పాల్పడిన గుడేపు సురేష్, సుజాత, తార లపై SC/ST (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టం కింద తక్షణమే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరుతున్నాడు.

